
హైదరాబాద్, 13 జూలై (హి.స.)
తెలంగాణకు అన్యాయం చేయడంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అని, తెలంగాణలో ఉన్నది హైబ్రిడ్ కాంగ్రెస్ అని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్.. సాగునీటికి ఇబ్బందులు లేని పరిస్థితి కల్పించారు. దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలవడంలో కేసీఆర్ పాత్ర కీలకం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతాంగం పరిస్థితి ఆగమైంది. మేడిగడ్డను పునరుద్ధరించాలని రిటైర్డ్ ఇంజినీర్లు సూచిస్తే.. వారిని జైల్లో పెడతా అని సీఎం రేవంత్రెడ్డి బెదిరిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై ఎలాంటి కేసులు పెట్టాలో డీజీపీ ఆలోచించుకోవాలి. నీళ్లు నిల్వ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దీనిపై చర్చకు మంత్రి ఉత్తమ్ సిద్ధమా? రేవంత్రెడ్డి పాలనలో 50 శాతం నేరాలు పెరిగాయి. కాంగ్రెస్ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చించే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు’’ అని జగదీశ్రెడ్డి విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్