పిల్లల చదువు, ఆరోగ్యం దెబ్బతినొద్దంటే ఆ మాత్ర కంపల్సరీ: మంత్రి దామోదర్
పిల్లల చదువు, ఆరోగ్యం దెబ్బతినొద్దంటే ఆ మాత్ర కంపల్సరీ: మంత్రి దామోదర్
Minister


హైదరాబాద్, 13 జూలై (హి.స.)

పిల్లల్లో నులిపురుగుల (నట్టలు)

సమస్యను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం హైదరాబాద్లోని రాజ్భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్భవన్ స్కూల్ పిల్లలకు మంత్రి ట్యాబ్లెట్స్ పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్ర తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల్లో నులిపురుగులు ఉండడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ సమస్యల కారణంగా చదువుపై పిల్లల శ్రద్ధ తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.

నులిపురుగులు బయటకు కనిపించకపోయినా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతి చిన్నారికి ఆల్బండజోల్ మాత్ర తప్పనిసరిగా వేయించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ మాత్ర వల్ల నులి పురుగుల సమస్య తొలగిపోయి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని, తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతాయని వివరించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం మాత్రలు వేయడంతోనే ముగిసిపోదని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీరు ఉపయోగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం వంటి మంచి అలవాట్లపై కూడా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.

విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు అందజేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏ కారణంతోనైనా మాత్ర వేయించుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న మాప్-అప్ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర వేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande