క్రమశిక్షణ, కష్టపడి చదివే అలవాటు, సమయపాలన విజయానికి పునాది.. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్
క్రమశిక్షణ, కష్టపడి చదివే అలవాటు, సమయపాలన విజయానికి పునాది.. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్
Collector


నాగర్ కర్నూల్, 13 జూలై (హి.స.)

కేజీబీవీలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థినులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రత్యేక అధికారిని, ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) సోమవారం ఉదయం ఆయన ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, వసతి, భోజన ఏర్పాట్లు, విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, తరగతి గదులు, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, వసతి గదులను పరిశీలించి కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.

అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. జీవశాస్త్రం సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. పాఠ్యాంశాలపై విద్యార్థినుల అవగాహనను పరిశీలిస్తూ, ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చదివితేనే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ బాలికలకు సూచించారు. అనంతరం విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించిన కలెక్టర్, కేజీబీవీలో విద్యాభ్యాసానికి సంబంధించిన వాతావరణం, హాస్టల్ సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, భద్రత, వైద్య సేవలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే ఏ చిన్న సమస్యనైనా సంకోచం లేకుండా ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.

పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన వారాంతపు మెనూను పరిశీలించారు. మెనూ ప్రకారం ప్రతి రోజూ ఆహారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని నేరుగా విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచి, నాణ్యత, పరిమాణం, పోషకాహార ప్రమాణాలపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్యులు విధుల్లో సమయానికి హాజరవుతున్నారా, రోగులకు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయా, అవసరమైన మందులు, అత్యవసర వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలపై వైద్యాధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారులు అత్యంత బాధ్యతతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, రెండో విడత లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించి నిజమైన అర్హులకే ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande