
హైదరాబాద్, 13 జూలై (హి.స.)
: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు సంవృద్ధిగా కురవాల్సిన సమయంలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి నాలుగున్నర డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో 37 డిగ్రీలు నమోదు కాగా మెదక్‌లో సాధారణ స్థాయి నుంచి 4.6 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు.
30 శాతంపైగా లోటు వర్షపాతం : రాగల 5,6 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురవకపోగా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు మరో ఒకటి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రాగల 5,6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 30 శాతంపైగా లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు.
ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి : తెలంగాణ రాష్ట్రంలో జులై 2వ వారంలో మంచిగా వర్షాలు పడే సమయమని, కానీ వానలు కరువకపోయిన క్లౌడింగ్ ఉందని, ఈ సమయంలో 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణగ్రత ఉండే అవకాశం ఉంటుందని శ్రీనివాస్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో మొదట వారంలో ఈదురుగాలులు వీచాయని, ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని, క్లౌడినెస్ కూడా లేదని చెప్పారు. దీంతో గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని, ప్రస్తుతానికి హెచ్చరికల స్థాయికి ఉష్ణోగ్రతలు పెరగలేదని వెల్లడించారు. వర్షాలు కురవకపోవడానికి ఎల్‌నినో ప్రభావం అని కూడా చెప్పవచ్చని, కొన్ని ప్రదేశాల్లో వర్షాలు విపరీతంగా కురిశాయని, కొన్ని చోట్ల వానలు పడలేదని, ఈ లక్షణాలు ఎల్నినోకే ఉంటాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi