
శ్రీశైలం, 13 జూలై (హి.స.) వారాంతపు సెలవులు (వీకెండ్) కావడంతో నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మల్లన్న సన్నిధికి భక్తులు అనూహ్య సంఖ్యలో పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.
ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆలయ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం, సోమవారం (జూలై 12, 13 తేదీల్లో) స్వామివారి విరామ వీఐపీ (బ్రేక్) దర్శనాలను, స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో (EO) శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు.
సిఫారసు లేఖలతో (Recommendation Letters) వచ్చే వారికి సైతం కేవలం స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 'మనమిత్ర' వాట్సాప్, ఆన్లైన్ ద్వారా స్పర్శ దర్శన టికెట్లు ముందుగానే పొందిన వారికి మాత్రం నిర్దేశిత వేళల్లో దర్శన అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. క్యూలైన్ల నిర్వహణను సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV