ఎల్-నినోకు తెలంగాణ రెడీ.. రైతుల కోసం మూడు దశల కార్యాచరణ
ఎల్-నినోకు తెలంగాణ రెడీ.. రైతుల కోసం మూడు దశల కార్యాచరణ
farmer


హైదరాబాద్, 13 జూలై (హి.స.)

వానాకాలం–2026లో ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసింది. రైతులకు నష్టం జరగకుండా మూడు దశల కంటింజెన్సీ ప్లాన్ అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌లో శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి విస్తృత సమీక్ష నిర్వహించారు.

ప్రతి వారం మండలాల వారీగా ప్రత్యేక బులెటిన్

ఎల్-నినో పరిస్థితులపై రైతులకు ఖచ్చితమైన సమాచారం అందించేందుకు ప్రతి వారం మండలాల వారీగా వ్యవసాయ–వాతావరణ బులెటిన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, నేల తేమ, భూగర్భ జలాల స్థితి, సాగునీటి లభ్యత, విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితి, రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు వంటి అంశాలు పొందుపరుస్తారు.

వరి రైతులకు ప్రత్యేక మార్గదర్శకాలు

వరి సాగు చేస్తున్న రైతులు నారు నిర్వహణ, నాటే దూరం, ఎరువుల వినియోగం, నీటి పొదుపు పద్ధతులపై శాస్త్రవేత్తలు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. ఇంకా నారు వేయని రైతులు తక్కువ కాలంలో పండే రకాలతో పాటు ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను పరిశీలించాలని తెలిపారు.

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో వరికి బదులుగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, అలసందలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక రైతులకు మేలు చేస్తుందని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande