
హైదరాబాద్, 13 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన అర్ధాంగి అన్నా కొణిదెల భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘పవన్ తన జీవితంలో శారీరక నొప్పి కంటే తీవ్రమైన ఎన్నో భారాలను మోశారు. ఎంతటి కష్టమైనా ఫిర్యాదు చేయని ఆయన, నొప్పి భరించలేని స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే తన బాధను బయటపెడతారు’’ అని ఆమె భావోద్వేగంగా తెలిపారు.
ముంబైలోని ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పరామర్శించిన ఫొటోను అన్నా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం తన దృష్టంతా పవన్ ఆరోగ్యంపైనే ఉందని తెలిపారు. ‘‘ఇప్పుడు నా పని ఒక్కటే.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవడం. ఆయన సురక్షితంగా ఉన్నారనే నమ్మకం కల్పించడం. ఒక్కో రోజు ముందుకు సాగుతూ ఆయన పూర్తిగా కోలుకుంటారు’’ అని ఆమె భావోద్వేగంగా రాశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi