
ఉంతకల్లు 13 జూలై (హి.స.)ఉంతకల్లు పట్టణంలో ఈ నెల 26వ తేది ఆదివారం నుంచి శ్రీ రుక్మిణి పాండురంగస్వామి ఆషాడ మాస బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, బొమ్మనహాళ్ మండలం, ఉంతకల్లు గ్రామంలో వెలసిన శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయాన్ని భక్తులు 'ఆంధ్ర పండరీపురం' అని పిలుస్తారు. ఈ క్షేత్రం మద్యపానానికి బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేసే మద్యాన్ని మాన్పించే దేవుడిగా ఎంతో ప్రసిద్ధి చెందింది.
ఈ ఊరిలోనివారంతా పాండురంగడి భక్తులే. శతాబ్దాల క్రితం ఈ ఊరికి చెందినవారు మహారాష్టల్రోని అత్యంత ప్రముఖమైన పుణ్యక్షేత్రాలలో ‘పండరీపురం’ వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పాండురంగ దేవాలయాన్ని స్థాపించారు. మద్యానికి బానిస అయినవారు ఈ దేవాలయం ఆవరణలో ‘పాండురంగ మాల’ ధరిస్తే మళ్ళీ జన్మలో మద్యం జోలికి వెళ్ళరన్న నమ్మకం భక్తుల్లో వుంది. ఈ నమ్మకాన్ని రుజువు చేసే తార్కాణాలు కూడా వున్నాయి.
పట్టణంలో ఈ నెల 26వ తేది ఆదివారం జరుగనున్న శ్రీ రుక్మిణి పాండురంగస్వామి ఆషాడ మాస బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మరాఠి అభంగాలు ఆలపించాలని *పామిడి భావసారా క్షత్రియ భజన మండలి*ని పట్టణ భావసారా క్షత్రియ సమాజ్ వారు ఆహ్వానించారు.
అనంతపురం నుంచి వచ్చిన సమాజ్ సభ్యులు పామిడికి విచ్చేసి భజన మండలి సభ్యులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. జ్ఞానదేవుడు, తుకారాం, నామదేవుడు రచించిన అభంగాలు పాడడంలో పామిడి భజన మండలి సభ్యులు ప్రావీణ్యం కలిగి ఉన్నారని, వారి కీర్తనలతో బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభ చేకూరుతుందని సమాజ్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు ఆహ్వానాన్ని స్వీకరించి 26న బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV