
తిరుమల, 13 జూలై (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 7 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా.. శిలాతోరణం వరకూ క్యూలైన్లో భక్తులు స్వామివారి సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనానికి 20-24 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5-7 గంటల సమయం పడుతుందని పేర్కొంది. ఇక.. నిన్న (ఆదివారం) 90,130 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 38,075 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు సమకూరింది. 4.24 లక్షల లడ్డూలు విక్రయించగా.. 3.11 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.
కాగా.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అలిపిరి వద్ద భూదేవీ కాంప్లెక్సు, శ్రీవారిమెట్టు, విష్ణునివాసం ప్రాంతాల్లో ఉదయం 10, 12 గంటలకు జారీ చేసే టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లను 7 గంటల నుంచే జారీ చేశారు. సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లు గంట వ్యవధిలోనే పూర్తయినట్లు టీటీడీ తెలిపింది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV