శాఖమూరు పార్కులో ఐదెకరాల్లో రైన్ ఫారెస్ట్
శాఖమూరు పార్కులో ఐదెకరాల్లో రైన్ ఫారెస్ట్
శాఖమూరు పార్కులో ఐదెకరాల్లో రైన్ ఫారెస్ట్


అమరావతి, 14 జూలై (హి.స.)

దట్టమైన అడవి.. తుంపర్లుగా కురిసే వర్షం.. జలపాతం సవ్వళ్లు.. పక్షుల కిలకిలారావాలు.. కాలిబాటల్లో నడక.. ఊహించటానికే ఎంతో బాగుంది కదూ..! రాజధాని అమరావతిలో అలాంటి ఒక కృత్రిమ ‘రెయిన్ ఫారెస్ట్’ను సృష్టించబోతున్నారు. అమరావతిలో 300 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న శాఖమూరు పార్కులో దట్టమైన అడవిలో విహరించినట్లు అనుభూతి కలిగేలా ఐదెకరాల్లో ‘మినీ అమెజాన్’ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.17.58 కోట్ల అంచనా వ్యయంతో అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) టెండర్లు పిలిచింది.

ఈ రెయిన్‌ ఫారెస్ట్‌లో 20 వేలకుపైగా చెట్లు, మొక్కలను నాటనున్నారు. సుమారు 400 రకాల వృక్షజాతులను పెంచేలా ప్రణాళిక రూపొందించారు.

ఇందులో అంతరించిపోతున్న మొక్కల జాతులతో పాటు స్థానికంగా పెరిగే నేటివ్‌ స్పీసీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ప్రకృతి సమతుల్యతను కాపాడే విధంగా వివిధ రకాల వృక్షాలను ఎంపిక చేయనున్నారు.

మియావాకీ విధానంలో దట్టమైన అటవీ అభివృద్ధి

రెయిన్‌ ఫారెస్ట్‌ను మియావాకీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ఎత్తుగా పెరిగే భారీ వృక్షాల నుంచి నేలకు ఆనుకుని పెరిగే చిన్న పొదల వరకు మొత్తం ఏడు స్థాయిల్లో మొక్కలను పెంచుతారు.

ఈ ప్రాజెక్టును కేవలం సందర్శకుల వినోదానికే కాకుండా జీవవైవిధ్య పరిరక్షణకు అనువైన కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.

పక్షులు, కీటకాలు, కుందేళ్లు వంటి చిన్న వన్యప్రాణులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించనున్నారు.

ప్రకృతి వ్యవస్థను ప్రతిబింబించేలా అడవిలో చిన్న తటాకాలు, సెలయేళ్లు కూడా నిర్మించనున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande