
ఢిల్లీ, 14 జూలై (హి.స.)వరంగల్ విమానాశ్రయం ఆకృతిలో కాకతీయ సంస్కృతికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయిడుతో చర్చించామని తెలిపారు. రెండు ఎయిర్పోర్టుల నిర్మాణానికి కేంద్రమంత్రి సహకరిస్తున్నారని వెల్లడించారు. దేశ జనాభాలో 2.50 శాతం జనాభా ఉన్న తెలంగాణ.. 5 శాతం జీడీపీ వాటా కలిగి ఉందని చెప్పుకొచ్చారు. ఈరోజు (మంగళవారం) ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో సీఎం మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆ స్ఫూర్తి కొనసాగుతోంది...
తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విమానాశ్రయాలు అవసరమని సీఎం తెలిపారు. ఈ రెండు విమానాశ్రయాల పనులు 2028, జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేసి ఆ రోజు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ సహకారానికి అవసరమైన చర్చలు చేపడుతున్నామని వివరించారు. అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార స్ఫూర్తి కొనసాగుతోందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీ వచ్చి కేంద్రమంత్రులను కలుస్తానని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్