
హైదరాబాద్, 14 జూలై (హి.స.)సింగరేణి నష్టాలకు గత ప్రభుత్వాలే కారణం అని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. సంస్థ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం నష్టాల్లో, కష్టాల్లో ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితి కారణంగా కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణకు సింగరేణి గుండెచప్పుడు లాంటిదని, రాజకీయాలు చేయడానికి తాను రాలేదని స్పష్టం చేశారు. సింగరేణిని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించిన ఆయన, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కలిసి సంస్థ సొమ్మును దోచుకున్నాయని విమర్శించారు. రూ.54,079 కోట్ల కార్మికుల సొమ్మును అప్పుల పాలయ్యేలా చేశారని ఆరోపించారు. సింగరేణి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని వ్యాఖ్యానించారు.
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్తో ఉపాధి అవకాశాలు..
సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకే తాను వచ్చినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. సంస్థను బలోపేతం చేసే దిశగా తాడిచర్ల-2 బాహుబలి బొగ్గు బ్లాక్ను తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ బ్లాక్లో సుమారు 434 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని చెప్పారు. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు సింగరేణి సంస్థ మరింత బలోపేతం అవుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్