దడ పుట్టిస్తున్న ఎండ.. వేసవి తరహాలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు
వర్షాకాలంలోనూ వేసవి తరహాలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
Hyderabad Temp


హైదరాబాద్, 14 జూలై (హి.స.)భానుడి భగ.. భగలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. వర్షాకాలంలోనూ వేసవి తరహాలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 1 నుంచి జూలై 13 వరకు హైదరాబాద్ జిల్లాలో సాధారణంగా 175 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 100.1 మిల్లిమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 43 శాతం తక్కువని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో సాధారణం కంటే 26 శాతం, మేడ్చల్-మల్కాజిగిరిలో 54 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 28 తక్కువ వర్షపాతం ఈ సీజన్లో నమోదైంది.

భారీవర్ష సూచనలు లేవు

మరో వారం రోజులు భారీ వర్ష సూచనలు కన్పించడం లేదని బేగంపేట సీనియర్ వాతావరణశాఖ అధికారి జీఎన్ఆర్ఎస్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నగరంలో నమోదవుతున్నాయి. మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

భారీగా విద్యుత్ డిమాండ్

ఎండల ప్రభావంతో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ భారీగా నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిందని విద్యుత్శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది జూలై రెండు వారాల్లో రోజువారీ విద్యుత్ వినియోగం 61-71 మిలియన్ల యూనిట్ల ఉండగా, ఈ ఏడాది జూలై 11 తేది నాటికి 71-82 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతోంది.

మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం

నగరంలో సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశాలుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో సోమవారం గరిష్ఠంగా 36.7 డిగ్రీలు, కనిష్ఠం - 25.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande