ఎత్తిపోతల కింద ఆరుతడి పంటలు వేయాలి
రేపటి నుంచి మొదటి దశ ప్రత్యామ్నాయ ప్రణాళిక ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొంటాం: మంత్రి తుమ్మల
Tummala nageshwar rao


హైదరాబాద్, 14 జూలై (హి.స.)ఎల్నినో ప్రభావం దృష్ట్యా ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా, రైతులు నష్టపోకుండా ఆదుకునేలా ముందస్తు కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.ఈ నెల 15, 30, ఆగస్టు 15 తేదీల ప్రాతిపదికన మూడు దశల అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించామని, మొదటి దశ బుధవారం ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగా శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య చర్యలను కలెక్టర్లు, వ్యవసాయాధికారులు రైతులకు తెలియజేసి కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. సోమవారం ఆయన అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ(ఇక్రిశాట్)లో ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుపై అత్యవసర సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, వాతావరణ, ఉద్యాన శాఖలు, అగ్రి, ఉద్యానవర్సిటీ, ఐఐఎంఆర్, ఐఐవోఆర్, అధికారులు, శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు.

శాస్త్రీయ విధానంలో.. ‘ఈ నెలతోపాటు వచ్చే నెలలోనూ సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా లేవు. దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శాస్త్రీయ విధానంతో అత్యవసర ప్రణాళికల అమలుకు నిర్ణయించాం. ఎత్తిపోతల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి. భూగర్భజలాలు త్వరగా ఇంకిపోతున్న దృష్ట్యా బావుల, బోర్ల కింద చిరుధాన్యాలు, తక్కువ నీటి వినియోగ పంటలు వేసేలా చూడాలి. వర్షపాతం నమోదై భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు, ఆ తర్వాత ఎరువులు వేయాలి. అని మంత్రి తుమ్మల తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande