
అనంతపురం, 14 జూలై (హి.స.) అనంతపురం నగరంలో కన్నతల్లే కాలయముడుగా మారిన ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడనే కోపంతో.. ఒక కన్నతల్లి తన సొంత కొడుకునే కత్తెరతో పొడిచి హతమార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అనంతపురం నగరం, మొదటి రోడ్డు, శివాలయం సమీపంలో పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మచారి, సునీతమ్మ దంపతులకు కుమారుడు సురేంద్ర ఆచారి, ఒక కూతురు ఉన్నారు. చదువుకుని ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు సురేంద్ర ఆచారి.. దారి తప్పి మద్యానికి బానిసయ్యాడు. తండ్రి కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే, అతనికి సహాయంగా ఉండాల్సింది పోయి.. నిత్యం మద్యం డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే ఈరోజు కూడా సురేంద్ర ఆచారి విపరీతంగా మద్యం తాగి వచ్చి, డబ్బుల కోసం తల్లిదండ్రులపై దాడికి దిగాడు. కొడుకు వేధింపులు భరించలేక, తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి సునీతమ్మ.. ఇంట్లో ఉన్న కత్తెరతో సురేంద్ర ఆచారి ఛాతిలో బలంగా పొడిచింది. తీవ్ర గాయాలైన సురేంద్ర ఆచారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సంఘటనా స్థలానికి చేరుకున్న మూడో పట్టణ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కన్నతల్లి సునీతమ్మపై కేసు నమోదు చేసి, ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV