
నెల్లూరు , 14 జూలై (హి.స.) నెల్లూరు జిల్లా, రాపూరు మండలంలో కండలేరు నదిపై ఉన్న కండలేరు -సోమశిల డ్యామ్ లలో ఉన్న తీవ్రమైన సమస్యలపై డ్యామ్స్ సేఫ్టీ సెల్ -సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కు బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ ఫిర్యాదు చేశారు.
విజయవాడలో ఈ రోజు ఉదయం సీడీవో కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్ శ్రీరామదాసు కు కండలేరు సమస్యలలో ప్రధాన సమస్యలను వివరించారు.. కండలేరు జలాశయం నిర్మాణ సమయంలో డ్యాం డీప్ కోర్స్ వద్ద 7.9 కిమీ నుండి 8.2 కి.మీ మధ్య డ్యాం అప్ స్టీమ్ లో రివీట్ మెంట్ నిర్మాణం చేయలేదు. కనీసం బర్మన్ కూడా నిర్మించలేదని చెప్పారు. జలాశయంలో నీటి ఒత్తిడి కారణంగా హార్టింగ్ కోర్ యొక్క క్లే బ్లాంకెట్ కోతకు గురవుతూ ఉందని చెప్పారు.
కండలేరు డ్యామ్ మట్టి కట్ట 8 కిమీ-10 కిమీ మధ్యలో 1.3 మీటర్లు స్థాయిలో క్రుంగడం (Shrinked )జరిగిందని తెలిపారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వారు కూడా కండలేరు మట్టి కట్టను 350 కోట్ల రూపాయలతో వెడల్పు చేసి, పట్టిష్ట పరచాలని నిర్ణయించారు..
మట్టికట్ట నిర్మాణం 30 సంవత్సరాలు దాటినందున డ్యామ్ పటిష్టతలో భాగంగా మట్టి కట్టను ఆధునికరించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం ముందు భాగంలో అప్రాన్ 2021 వరదలలో కొట్టుకుపోయింది..
అప్రాను నిర్మాణ పనులను కూడా నిలిపి వేసి ఉన్నారని చెప్పారు. జలాశయాల భద్రతలో భాగంగా అప్రాన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సోమశిల కండలేరు జలాశయాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది లేరని, సోమశిల జలాశయంలో 2010లో 47 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారని చెప్పారు.
కండలేరు జలాశయంలో గతంలో 35 మంది సిబ్బంది ఉండగా నేడు ఐదు మంది మాత్రమే జలాశయం నిర్వహణలో ఉన్నారని చెప్పారు. డ్యాముల సేఫ్టీ దృష్ట్యా సాంకేతిక సిబ్బంది ని తగినంత మందిని నియమించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV