తిరుమలలో ఏ మాత్రం తగ్గని రద్దీ.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ
తిరుమలలో ఏ మాత్రం తగ్గని రద్దీ.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూ
తిరుమల


తిరుమల, 14 జూలై (హి.స.) వీకెండ్ లోనే కాదు.. వీక్ డేస్ లోనూ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 5 రోజులుగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఫలితంగా సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి రికార్డు సమయం పడుతుంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాతి నుంచి ఎలాంటి టోకెన్ లేకుండా క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5-7 గంటలు సమయం పడుతుందని వెల్లడించింది.

నిన్న (సోమవారం) స్వామివారిని 75,836 మంది భక్తులు దర్శించుకోగా.. 34,076 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.5.03 కోట్లు సమకూరింది. 4.19 లక్షల లడ్డూలను విక్రయించగా.. 2.73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. కాగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 10 గంటలు, 12 గంటలు నుంచి ఇవ్వాల్సిన రేపటి ఉచిత దర్శన టోకెన్లను మంగళవారం తెల్లవారుజాము నుంచే జారీ చేశారు. భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీవారిమెట్టు వద్ద 10,000 సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల కోటా పూర్తయిందని టీటీడీ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande