
నంద్యాల, 14 జూలై (హి.స.)
నంద్యాల జిల్లా మహానంది మండలంలో వన్యప్రాణుల వేటకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అడవి పంది, అడవి పిల్లి మాంసంతో పాటు వేటకు ఉపయోగించిన రెండు కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం... మహానంది మండలం బుక్కాపురం గ్రామ పరిధిలోని ఓ అరటి తోటలో అక్రమంగా కరెంట్ తీగలు ఏర్పాటు చేసి అడవి పంది, అడవి పిల్లిని వేటాడినట్లు విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల మాంసంతో పాటు వేటకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మహానంది మండలానికి చెందిన రమేష్, వెంకటేష్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. కాగా, ఈ ఘటనలో మరో నిందితుడు నాగరాజు పరారీలో ఉండటంతో అతని కోసం అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV