
కర్నూలు, 14 జూలై (హి.స.)కర్నూలు జిల్లాలోని బళ్లారి చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఏపీఎస్పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వర ప్రసాద్ రెడ్డి(43) అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు(మంగళవారం) ఉదయం హైవేపై జాగింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వాహనం ఢీకొట్టడంతో హెడ్ కానిస్టేబుల్.. వంతెన పైనుంచి కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హెడ్ కానిస్టేబుల్ మృతి బాధాకరం: హోం మంత్రి అనిత
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ వర ప్రసాద్ రెడ్డి మృతి చెందడంపై హోం మంత్రి అనిత స్పందించారు. హెడ్ కానిస్టేబుల్ మృతి తీవ్ర విచారకరమన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో సేవలందించిన ఒక పోలీసు సిబ్బందిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా నిలిచి, అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ప్రమాదానికి గల కారణాలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర ప్రసాద్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV