పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
pawan


అమరావతి, 19 జూలై (హి.స.)

జపాన్ ఓపెన్ సూపర్ 750లో అద్భుత విజయం సాధించినందుకు పీవీ సింధుకిఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ 750లో అకానె యమగుచిపై సింధు నిర్భయమైన ఆట ప్రదర్శించారని ప్రశంసించారు. భారతీయ ఛాంపియన్కు ఉండాల్సిన పట్టుదల, దృఢ సంకల్పం, అకుంఠిత స్ఫూర్తికి నిజమైన నిదర్శనమని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు.

మరింత బలంగా ఎదుగుతూ, సవాళ్లను అధిగమిస్తూ, తిరిగి అగ్రస్థానాన్ని సింధు కైవసం చేసుకోవడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపిందని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. జపాన్లో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ను గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచారని తెలిపారు. సింధు మరోసారి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. సింధు ప్రయాణం లక్షలాది మంది యువ క్రీడాకారులకు పెద్ద కలలు కనడానికి, కష్టపడటానికి, ఎప్పటికీ వదులుకోకుండా ఉండటానికి స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకానికి కీర్తిని తెస్తూ సింధు ముందుకు సాగే క్రమంలో, ఈ అద్భుతమైన విజయం మరెన్నో చరిత్రాత్మక విజయాలకు నాంది పలకాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. దేశమంతా సింధుతో కలిసి ఈ విజయాన్ని జరుపుకుంటోందని తెలిపారు. భవిష్యత్తు ప్రయాణంలో సింధు నిరంతర విజయాలు సాధించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande