
హైదరాబాద్, 20 జూలై (హి.స.)రాజధానిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. అల్పాదాయ వర్గాల(ఎల్ఐజీ) ప్రజలకు లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కావాల్సిన కార్యాచరణను సోమవారం సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్లు ప్రారంభించనున్నారు. ఇళ్ల దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతోపాటు బ్రోచర్ను వారు విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి 32 జిల్లాల పరిధిలో సుమారు 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఇప్పటికే ఇందులో 2లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. రెండో విడతలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో) రాష్ట్రంలో 2.50 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి తోడు క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ప్రజలకు అదనంగా మరో లక్ష ఇళ్లను కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే క్యూర్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మేడ్చల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నాంపల్లి, పటాన్చెరుతోపాటు ఇతర ప్రాంతాల్లో అనువైన స్థలాలను గుర్తించారు. నియోజకవర్గాల వారీగా ఎన్ని టవర్లు, వాటిలో ఎన్ని ఫ్లాట్లు నిర్మించవచ్చనే దానిపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని కార్యాచరణకు ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుట్టనుంది.
పది అంతస్తుల వరకు నిర్మాణం: మంత్రి పొంగులేటి
క్యూర్ పరిధిలో తొలి విడతలో 26 నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘క్యూర్ పరిధిలోని ఎల్ఐజీ ప్రజల ఇళ్ల కోసం రూ.కోట్ల విలువైన ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు స్థలాలు గుర్తించాం. పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోని స్థలాల్లోనే ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నాం. పది అంతస్తుల వరకు నిర్మాణం చేపడతాం. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని అమలు చేస్తున్నాం. ప్రజలు వారి నియోజకవర్గం పరిధిలో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై దృష్టిసారించింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నాం’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్