
తిరుపతి, 20 జూలై (హి.స.)
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈరోజు(సోమవారం) తిరుపతిలో జరిగిన షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ల ద్వారా ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యా సామగ్రిని అందిస్తున్నామని చెప్పారు.
మధ్యాహ్న భోజనంలో పోషకాహారాన్ని పెంచి విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో నిలిచిపోయిన ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించామన్నారు. సూపర్ సిక్స్ హామీలో భాగంగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని చెప్పారు. ‘హెల్తీ- వెల్తీ- హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ఈ నెల 24న జరిగే పేరెంట్-టీచర్ సమావేశాలను తల్లిదండ్రులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేడు విద్యార్థులపై పెట్టుబడి పెడితేనే రేపటి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ప్రతిభను ప్రోత్సహించడమే ‘షైనింగ్ స్టార్స్–2026’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. విద్య ద్వారా తిరుపతి జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. తిరుపతిని ఆధ్యాత్మికంగా, క్రీడలపరంగా, పారిశ్రామికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ