
హైదరాబాద్, 21 జూలై (హి.స.)
హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట
ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కల్యాణాన్ని తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి, కుమార్తె హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి సతీమణి కావ్యా రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ తదితరులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కల్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలతో పాటు భక్తులు సులభంగా అమ్మవారి కల్యాణాన్ని తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వీఐపీ దర్శనాలు, వికలాంగులు, జోగినిల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో ఎలాంటి తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు..కల్యాణ మహోత్సవం అనంతరం కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
కల్యాణ మహోత్సవం అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. అమ్మవారి కల్యాణం ఘనంగా జరిగిందని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారని పేర్కొన్నారు. ముందస్తు సమీక్షలు నిర్వహించి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. జోగినిలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించామని, వారు తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వారిని వీఐపీ గ్యాలరీలో తమతో సమానంగా కూర్చోబెట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణయాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. నిజాం కాలం నుంచే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని, అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయనే భక్తుల విశ్వాసం ఉందన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆలయాల అభివృద్ధి, ఉత్సవాల నిర్వహణకు నిధులు కేటాయిస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిమగల బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం లోకకల్యాణం కోసం ఘనంగా నిర్వహించామని తెలిపారు. గతంలో ఎన్నో విపత్తులను ఎదుర్కొన్నామని, ఎల్నెనో ప్రభావాన్ని కూడా ఎదుర్కొంటామని అన్నారు..అమ్మవారి కృపాకటాక్షంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగేలా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా చిన్నచిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయని, వాటిని అధిగమిస్తూ భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపై ఉండాలని, తెలంగాణ సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు