సాగునీటి సంస్థల బలోపేతానికి కార్యాచరణ
నిధుల సమీకరణకు కొత్త ప్రణాళిక మంత్రి ఉత్తమ్ వెల్లడి
Uttam Kumar reddy


హైదరాబాద్, 20 జూలై (హి.స.)సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో సాగునీటిసంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, ఈఎన్సీ రమేశ్బాబు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ..‘సంస్థల రుణభారం తగ్గించి, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10రోజుల్లో సమగ్రఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాలి. రాష్ట్ర బడ్జెట్పై ఆధారపడకుండా సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించేందుకు కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలి. ప్రాజెక్టులకు సంబంధించిన ఖాళీ భూముల్లో సౌరవిద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం లేదా లీజుకు ఇచ్చి ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలి. నిజాంసాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలి. అన్ని ప్రతిపాదనలను చట్టపరంగా పరిశీలించిన తర్వాతే అమలుచేయాలి. 2022-23తో పాటు పెండింగ్లో ఉన్న అన్ని ఆర్థిక సంవత్సరాల చట్టబద్ధ ఆడిట్లను వెంటనే పూర్తిచేయాలి’ అని మంత్రి పేర్కొన్నారు.

అధికారులు మాట్లాడుతూ.. ‘గతంలో అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరిస్తే ప్రభుత్వంపై పడుతున్న ఆర్థికభారం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం సుమారు 11 శాతం వడ్డీతో ఉన్న రుణాలను తక్కువ వడ్డీకి మార్చితే ఏటా సుమారు రూ.250 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన రుణ వివరాలు, వడ్డీ, చెల్లింపులు, పనుల పురోగతి, పూర్తి చేయడానికి అవసరమైన నిధులు తదితర అంశాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి. శాఖకు చెందిన భూములు, ఇతర ఆస్తుల పూర్తి వివరాలను 15 రోజుల్లో సిద్ధంచేసి వనరుల సమీకరణకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande