
మహబూబాబాద్, 20 జూలై (హి.స.)
అమాయకుల ఆకలిని ఆసరా చేసుకుని అత్యవసరాలను పెట్టుబడిగా మార్చుకుని కొండంత వడ్డీలతో నిరుపేదల శ్రమను నిలువునా దోచుకుంటున్న అక్రమ దందా ఆట కట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరిష్ గ్రీన్ సిగ్నల్తో సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో డోర్నకల్ మండల వ్యాప్తంగా పక్కా ఆపరేషన్ జరిపారు. ఏకంగా 8 మంది ఎస్ఐలు, భారీ పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా విడిపోయి, ఎవరూ ఊహించని విధంగా తెల్లవారుజామున వడ్డీ వ్యాపారుల ఇండ్ల తలుపులు తట్టారు. పలుచోట్ల విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ చంద్రమౌళి మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించి, అమాయకులను వేధించే వడ్డీ వ్యాపారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా దందా చేసినా.. అధిక వడ్డీల పేరుతో వేధించిన జైలు కూడు గ్యారెంటీ అని స్పష్టం చేశారు. బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..