
హైదరాబాద్, 20 జూలై (హి.స.)
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల్లో
తల్లిదండ్రులను పీడిస్తూ సాగుతున్న విచ్చలవిడి ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు స్కూళ్లు వసూలు చేసే ట్యూషన్ ఫీజుల వివరాలను కచ్చితంగా పాఠశాల నోటీసు బోర్డులతో పాటు తమ అధికారిక వెబ్సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాలని సంచలన ఆదేశాలను జారీ చేసింది.
అయితే, కేవలం స్కూళ్ల ఫీజు వివరాలు వెల్లడించడమే కాకుండా, ప్రైవేట్ స్కూళ్లు తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించి సీఏ ధృవీకరించిన ఆడిట్ రిపోర్టులను జులై 30లోగా విద్యాశాఖ అధికారిక పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా ఆడిట్ నివేదికలను సమర్పించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతుండటంతో తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాల ఆధారంగా ఫీజులను నియంత్రించేందుకు, అదనపు వసూళ్లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఫీజుల నియంత్రణ చట్టం(Fee Regulatory Law/Act) తీసుకొచ్చేందుకు ఓ ప్రత్యేక కమిటీ వేయాలని ఆలోచన చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు