'తప్పులు దొర్లితే సహించేది లేదు'.. అధికారులకు కలెక్టర్ సీరియస్ వార్నింగ్
'తప్పులు దొర్లితే సహించేది లేదు'.. అధికారులకు కలెక్టర్ సీరియస్ వార్నింగ్
Collector


వికారాబాద్, 20 జూలై (హి.స.)

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా హై అలర్ట్ అయింది. దుద్యాల, హకీంపేట్ గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్' పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని సోమవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహరా కలిసి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పర్యటన స్థలాలు, భద్రతా ఏర్పాట్లను అంగుళం అంగుళం జల్లెడ పడుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) పరిధిలో జరుగుతున్న వివిధ ప్రగతి పనులను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించనున్నారని, ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ముఖ్యంగా హెలిప్యాడ్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మొత్తం 9 బ్లాక్లలో పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సీఎం సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడొద్దని ఎస్పీ స్నేహ మెహరా పోలీస్ అధికారులను ఆదేశించారు. పర్యటనను అత్యంత విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు 24 గంటలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande