
తిరుమల , 20 జూలై (హి.స.) భక్తుల కొంగుబంగారం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల తాకిడి తీవ్రంగా ఉంది. టోకెన్లు లేకుండా నేరుగా వచ్చే భక్తులకు స్వామివారి ఉచిత సర్వదర్శనం (Sarava Darshan) లభించడానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. కంపార్టుమెంట్లు నిండిపోయి క్యూలైన్లు బయటి వరకు వచ్చాయి.
ఇక ఆదివారం ఒక్కరోజే శ్రీవారిని మొత్తం 90,956 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 33,406 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా లభించింది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు సహకరించి, అధికారుల సూచనలను పాటించాలని టీటీడీ రిక్వెస్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV