
కర్నూలు, 21 జూలై (హి.స.) తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ ఏపీ అటు తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి.
ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న బుధవారం నాటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాయలసీమలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ ప్రాంతాల్లో కూడా వర్షాల సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఇవాళ 3 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం ఉన్నట్లు APSDMA పేర్కొంది. ఈ క్రమంలో నేడు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల జారీ చేశారు అధికారులు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV