
అమరావతి, 21 జూలై (హి.స.)
ఏపీ దేవదాయ ట్రైబ్యునల్ చైర్పర్సన్గా రిటైర్డ్ జిల్లా జడ్జి ఎ.భారతి నియామకం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. ట్రైబ్యునల్ చైర్పర్సన్, రిజిస్ట్రార్ జనరల్లను ప్రతివాదులుగా చేరుస్తూ వేసిన అనుబంధ పిటిషన్ను అనుమతించింది. ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యుల హోదాను తగ్గించేందుకు వీలుకల్పిస్తూ తీసుకొచ్చిన దేవదాయచట్టంలోని సెక్షన్లను సవాల్ చేస్తూ వేసిన ప్రధాన వ్యాజ్యంతో ప్రస్తుత అనుబంధ పిటిషన్ను జత చేయాలని ఆదేశించింది. చైర్పర్సన్ భారతికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబరు 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ దేవదాయ ట్రైబ్యునల్ చైర్మన్, సభ్యుల హోదాను తగ్గించేందుకు వీలుకల్పిస్తూ దేవదాయశాఖ చట్టంలోని సెక్షన్ 164(2)ను తీసుకొచ్చారని, దీనిని రద్దు చేయాలని కోరుతూ విజయవాడ కానూరుకు చెందిన రేచింతల వేమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అయితే భారతిని ట్రైబ్యునల్ చైర్పర్సన్గా నియమిస్తూ ఈనెల 17న ప్రభుత్వం జారీ చేసిన జీవో 435ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, జీవో అమలును నిలిపివేయాలని కోరుతూ తాజాగా అనుబంధ పిటిషన్ దాఖలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ