ఆక్రమణల కోరల్లో ఎస్పీ కాలనీ పార్కు.. రక్షించాలని హైడ్రా కమిషనర్ను కోరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే
ఆక్రమణల కోరల్లో ఎస్పీ కాలనీ పార్కు.. రక్షించాలని హైడ్రా కమిషనర్ను కోరిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే
Mla


హైదరాబాద్, 21 జూలై (హి.స.)

నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే పార్కులు ఆక్రమణలకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడ ఎస్పీ కాలనీ (శ్రీ వెంకటేశ్వర కాలనీ) పబ్లిక్ పార్కు కూడా అక్రమ నిర్మాణాల బారిన పడడంతో, దానిని రక్షించాలని స్థానికులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఈ పార్కు అభివృద్ధికి సుమారు రూ.12 లక్షలు మంజూరు చేసి వాకింగ్ ట్రాక్ నిర్మాణం, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటించామని గుర్తు చేశారు. అయితే కొందరు వ్యక్తులు పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటు రేకుల షెడ్డును ఏర్పాటు చేయడం వల్ల పార్కు అసలు ఉద్దేశమే దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కులను ఆక్రమించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, పార్కులోని అన్ని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి, పార్కును పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని హైడ్రా అధికారులను కోరారు.

కాలనీవాసులకు మళ్లీ స్వచ్ఛమైన వాతావరణంలో నడక, వ్యాయామం చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, రెండు రోజుల్లో ప్రత్యేక సిబ్బందిని పంపించి పార్కులోని ఆక్రమణలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుని పార్కును ఆక్రమణల నుంచి విముక్తి చేసి ప్రజలకు తిరిగి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ హామీతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ, పార్కు పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు. ప్రజా స్థలాల పరిరక్షణలో అధికారులు ఇదే తరహా చొరవ కొనసాగించాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande