
హనుమకొండ, 21 జూలై (హి.స.)
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింద. ఎల్సీనో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణ, కంటింజెన్సీ ప్రణాళికలు, వివిధ శాఖల సంసిద్ధతపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశమున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై విస్తృతంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు.
ఆ ప్రత్యేక అధికారులు వ్యవసాయం, తాగునీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితి, వర్షాభావ ప్రభావం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తారని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి దేవసేనను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు వెల్లడించారు.
వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు అవసరమైన భరోసా కల్పించడంతో పాటు తాగునీటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందన్నారు. జిల్లాల పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, అవసరమైన ఆర్థిక సహాయం, మద్దతు పొందేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు