
రాజన్న సిరిసిల్ల, 21 జూలై (హి.స.)
జిల్లావ్యాప్తంగా నీటి సంరక్షణ పనులను వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల అమలుపై హౌసింగ్ ఏఈలు, ఎంపీడీఓలు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు, ఊట కుంటలు, బోర్వెల్ రీచార్జ్ పనులను గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫామ్ పాండ్లు, బోర్వెల్ రీచార్జ్ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
అలాగే ప్రభుత్వ, ప్రజల బోర్వెల్ రీచార్జ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేయాలని, నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ పేర్కొన్నారు. మొదటి దశలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి స్థాయిల వారీగా పురోగతి సాధించాలని, ప్రతి మండలంలో నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, నిర్మాణ సామగ్రి తదితర అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి అవసరమైన సహకారం అందించాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు