
హనుమకొండ, 21 జూలై (హి.స.)
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో రోడ్డు పక్కన, ప్రధాన కూడళ్లలో చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు గొడుగులు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో హసన్పర్తిలోని మహాలక్ష్మి బ్యాంకెట్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ రాజ్లతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు హాజరై చిరు వ్యాపారులకు గొడుగులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఎండ, వానలను లెక్కచేయకుండా రోడ్ల పక్కన వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులకు కొంత ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు రోజంతా కష్టపడి జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వారికి నీడ కల్పించడం గొప్ప సేవా కార్యక్రమమని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ గతంలో కూడా విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. సమాజానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలను భవిష్యత్లో చేపట్టాలని ఆయన కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు