
అనంతపురం, 21 జూలై (హి.స.) రాయలసీమ జిల్లాల్లో 9.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడాన్ని లక్ష్యంగా చేసుకుని, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కాలువల బలోపేతం, ఎత్తిపోతల పథకాల ఆధునీకీకరణతో రాయలసీమ చరిత్రలోనే ఒక అతిపెద్ద సాగునీటి యజ్ఞానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి.. రాయలసీమ అనగానే మనకు గుర్తొచ్చేది కరువు, సాగునీటి ఎద్దడి. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నెన్నో ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. కానీ, సీమలోని మెజారిటీ ప్రాంతాలు ఇప్పటికీ ఆకాశం వైపు చూడాల్సిందే. పడిపోతున్న భూగర్భ జలాలు, పాతబడిపోయిన కాలువలు ఇక్కడి రైతాంగాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కాగితాల మీద వేల ఎకరాల ఆయకట్టు సృష్టించినట్లు లెక్కలు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో రైతు పొలానికి నీరు చేరడం అనేదానికి మాత్రం ఎప్పుడూ మోక్షం లభించలేదు. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం కొత్త ప్రకటనలు, శంకుస్థాపనలకే పరిమితం కాకుండా, ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది.
రూ. 20,884 కోట్ల విలువైన సాగునీటి పనులు.. అధికారిక లెక్కల ప్రకారం, ప్రస్తుతం రాయలసీమ అంతటా రూ. 20,884 కోట్ల విలువైన సాగునీటి పనులు క్షేత్రస్థాయిలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే అదనంగా 52 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల 4.37 లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు నీరు స్థిరపడటమే కాకుండా, మొత్తంగా దాదాపు 9.80 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రస్తుతం జరుగుతున్న అతిపెద్ద సాగునీటి కార్యక్రమం ఇదే కావడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV