
హైదరాబాద్, 22 జూలై (హి.స.)హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వెళ్తున్నారా? సిగ్నల్ దగ్గర ఉండే ట్రాఫిక్ పోలీసు కెమెరాను తప్పించుకుంటే చాలనుకుంటున్నారా? అయినా మీకు చలానా రావడం ఖాయమంటున్నారు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని అప్లైడ్ ఏఐ రీసెర్చ్సెంటర్ పరిశోధకులు. ‘డ్యాష్కామ్’ పేరుతో వారు ఒక కెమెరా రూపొందించారు. కృత్రిమమేధ(ఏఐ) సహకారం, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పనిచేసే ఈ కెమెరాను ట్రాఫిక్ పోలీసుల వాహనాల్లో అమర్చారు. ఇది రహదారుల్లో తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల నంబర్ప్లేట్లను చిత్రీకరిస్తుంది. ఈ ఫొటోలను ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ సర్వర్ వివరాలున్న డేటాకు అనుసంధానిస్తే.. ఫలానా వాహనం నిబంధన ఉల్లఘించిందంటూ ట్రాఫిక్ పోలీసుల చలానా వ్యవస్థకు సమాచారం వెళ్తుంది. అక్కడున్నవారు వాహనదారుల ఫోన్లకు చలానా వివరాలను పంపుతారు. డ్యాష్కామ్ పనితీరును తెలుసుకునేందుకు పరిశోధకులు హైదరాబాద్లోని నాలుగు ట్రాఫిక్ ఠాణాల పరిధుల్లోని 4 ఇన్నోవా వాహనాల్లో ఒక్కో డ్యాష్ కామ్ను విండ్షీల్డ్ వద్ద అమర్చి 6 నెలలపాటు పరిశీలించారు. ఈ కెమెరా తయారీకి రూ.8-10 వేలు ఖర్చయిందని, ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయని ఏఐ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధి పృథ్వీ జొన్నాడ తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు ద్విచక్ర వాహనాలకూ 3 కెమెరాలను ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా ట్రాఫిక్ ఉల్లంఘనులను గుర్తిస్తున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్