
జగిత్యాల, 25 జూలై (హి.స.)
మెట్పల్లి పట్టణంలోని నిర్మాణంలో
ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన ఆసుపత్రి భవనంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులను పూర్తిచేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మెట్పల్లి మండలం అమ్మక్కపేట అర్బన్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) భవనాన్ని కూడా పరిశీలించారు.
అక్కడ జరుగుతున్న పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతకు ఎలాంటి రాజీ పడకుండా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ ఆరోగ్య కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..