
అమరావతి, 25 జూలై (హి.స.)
రవాణా రంగంలో ‘PM e- Bus Sewa’ తో నూతన శకం మొదలైంది. ఈరోజు(శనివారం) విశాఖలోని సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ‘PM e-Bus Sewa’ పథకం కింద ఏర్పాటవుతున్న సింహపురి ఈ-బస్సు డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖకు కేటాయించిన 100 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ఆధునిక పవర్ రూమ్ సిద్ధమైందని మంత్రి తెలిపారు. పవర్ రూమ్తో పాటు సబ్స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలు వేగంగా పూర్తికానున్నాయన్నారు.
మరో రెండు నుంచి మూడు నెలల్లో ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు. ఈ-బస్సుల రాక నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి తొలి దశలో 750 ఈ-బస్సులు రాగా.. అందులో విశాఖకు 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. ప్రస్తుత బస్సులతో పాటు కొత్త ఈ-బస్సులతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్పరం చేయడం జరగదని... అపోహలకు తావులేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ