ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను అమ్ముకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు
Revanthreddy


కొడంగల్, 22 జూలై (హి.స.)భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలను అమ్ముకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. దిల్లీలో నిన్న రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును వ్యతిరేకిస్తూ కొడంగల్లోని అంబేడ్కర్ కూడలిలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈసందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ... నీట్ ప్రశ్నపత్రాలను పల్లీబఠానీల్లా కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని, ప్రజా ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలన్నారు.

‘‘లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ధర్మేంద్రప్రదాన్ చెలగాటం ఆడారు. ఆయన రాజీనామా చేయాలని దిల్లీలో యువత ఆందోళన చేపట్టింది. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా సమస్యల్ని ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. 20వ తేదీ నుంచి ప్రారంభమైన పార్లమెంట్ ఉభయసభల్లో.. ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అడిగినా ప్రభుత్వం అనుమతించడం లేదు. లోక్సభ స్పీకర్ అంగీకరించడం లేదు. ప్రజాస్వామ్యానికి ఇది దురదృష్టకరమైన పరిస్థితి. దిల్లీ పోలీసులు రాహుల్గాంధీని కొడితే ఆయన ముక్కులో నుంచి రక్తం కారింది. ఈ దేశం కోసం రక్తం చిందించడంలో రాహుల్ గాంధీ మొదటివారు కాదు.. చివరివారూ కాదు. ఆనాడు మహాత్మాగాంధీ తెల్లదొరలతో కొట్లాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. గాంధీజీని పొట్టన పెట్టుకున్న గాడ్సే వారసులు మీరు’’ అంటూ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. తొలుత రేవంత్రెడ్డి నివాసం నుంచి కొడంగల్లోని అంబేడ్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande