
హనుమకొండ, 22 జూలై (హి.స.)
దేశ యువత భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెడుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం హనుమకొండలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో సామాన్య ప్రజలు, విద్యార్థుల తరఫున ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయించడం బీజేపీ అహంకారానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా కాంగ్రెస్ పార్టీ భయపడదని, ప్రజల తరఫున పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం కేంద్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అన్యాయం చేస్తూ, ప్రశ్నాపత్రాలను అమ్ముకుంటున్న విద్యా మాఫియాకు ఈ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని విమర్శించారు. విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..