తెలంగాణలో ‘లిఫ్ట్’ చట్టం వస్తోంది
ముసాయిదా బిల్లు సిద్ధం.. త్వరలో అసెంబ్లీ ముందుకు.
Lift


హైదరాబాద్, 22 జూలై (హి.స.)రాష్ట్రంలో తరచూ లిఫ్ట్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. వాటిని అరికట్టేలా పడక్బందీ చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేసింది. దీనికి సీఎం రేవంత్రెడ్డి గత నెల 25న ఆమోదం తెలిపారు. న్యాయశాఖ పరిశీలన అనంతరం క్యాబినెట్ ముందుకు రానుంది. లిఫ్ట్లలో తలెత్తే సమస్యలతో ప్రజలు ప్రమాదంలో పడుతున్నారని.. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాలు స్పష్టం చేసింది.

ప్రయోజనాలెన్నో..

కొత్త చట్టంతో లిఫ్ట్లు తయారు చేసే కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. భవనాలు, ఇళ్లల్లో ఏర్పాటు చేసిన ప్రతి లిఫ్ట్, ఎస్కలేటర్, మూవింగ్ వాక్ నిర్ణీత నాణ్యత ప్రమాణాలు (బీఎస్ఐ) కలిగి ఉండాల్సిందే. ప్రభుత్వం నియమించిన ఇన్స్పెక్టర్ల ద్వారా ఏటా తనిఖీలు జరిపించి అవి సురక్షితంగా ఉన్నాయో, లేదో చూస్తారు. గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులు, సంస్థల ద్వారానే నిర్వహణ చేయించేలా నిబంధనలు అమల్లోకి వస్తాయి. తయారీలో నాణ్యత లేకుంటే.. ఆ కంపెనీలపై వినియోగదారుల ఫోరంలో కేసులు వేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చట్టం తేవడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలంగాణ ఎలివేటర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు అవినాష్ చల్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఏపీ బిల్లు సిద్ధమైందనీ.. లిఫ్టులను అత్యవసర సేవలుగా గుర్తించి ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande