
ఆనందపురం, 23 జూలై (హి.స.)
: విశాఖ జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బంద గ్రామంలో బుధవారం సాయంత్రం మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం ఉదయం పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చిన్న దబ్బంద గ్రామానికి చెందిన కుమ్మోజు సూరిబాబు, కొత్త దబ్బందకు చెందిన లెంక వంశీ ఇద్దరూ కలిసి మద్యం సేవించేందుకు గొల్లల దబ్బంద సమీపంలోని ఓ ప్రైవేట్ లేఔట్లోకి వెళ్లారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వంశీ రాయితో సూరిబాబు తలపై దాడి చేశాడు. తీవ్ర గాయంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు సూరిబాబును 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
వాట్సప్లో సూరిబాబు నేలపై పడి ఉన్న వీడియోలు చూసిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఆనందపురం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు లెంక వంశీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు ఆనందపురం ఎస్సై హరీష్ మాట్లాడుతూ.. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో వీరిద్దరి మధ్య ఎలాంటి పాత కక్షలు లేవని, మద్యం మత్తులోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. మృతుడికి భార్య కామేశ్వరి, ఒక కుమార్తె ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ