
హైదరాబాద్, 23 జూలై (హి.స.)విద్యుత్ ఉద్యోగుల అక్రమాలకు అంతులేకుండా పోయింది. ఈ శాఖలోని కొందరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకుంటున్నా ఏమాత్రం భయం కనిపించడం లేదు. పనుల కోసం వచ్చే ప్రజల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ఉప ఇంజినీరు(డీఈ) ఇంటిపై ఏసీబీ దాడులు చర్చనీయాంశంగా మారింది. కొందరు ఇంజినీర్లు, ఉద్యోగులతోపాటు పొరుగుసేవల సిబ్బంది సైతం చేతివాటం ప్రదర్శించడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల ఉత్తర తెలంగాణ డిస్కంలో పొరుగు సేవల ఉద్యోగి ఏకంగా సంస్థ అధికారుల లాగిన్లలోకి చొరబడి రూ.5 లక్షలను అక్రమంగా మంజూరు చేసుకున్నారు. జూన్లో హైదరాబాద్ ఐడీఏ బొల్లారం ప్రాంత విద్యుత్ ఇంజినీరు రామకృష్ణారెడ్డి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఓ వ్యక్తి కరెంటు స్తంభాన్ని కారు ఢీకొన్నందుకు కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.25 వేల లంచం డిమాండు చేసి ఈయన ఏసీబీ వలలో చిక్కారు.
గుత్తేదారులతో కుమ్మక్కై...
విద్యుత్ సంస్థల్లో పనులు చేసే గుత్తేదారులు, ప్రైవేటు కంపెనీల నుంచి ఉద్యోగులు లంచాలు వసూలు చేస్తున్నారు. ఇదే అవకాశంగా గుత్తేదారులు క్షేత్రస్థాయిలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి ఫీడర్లో కరెంటు స్తంభంపై మంటలు రావడంతో సరఫరా నిలిపివేశారు. గుత్తేదారు ఒక యువకుడిని స్తంభంపైకి ఎక్కించి మరమ్మతు చేయిస్తుండగానే సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరాను ఆన్ చేశారు. యువకుడికి షాక్ తగిలి ప్రాణాపాయస్థితికి చేరుకోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఇక్కడ స్తంభంపై మరమ్మతులకు ప్రైవేటు యువకుడిని ఎలా ఎక్కించారు... అక్కడి లైన్మెన్, ఇంజినీర్లు ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.
దగ్గర లేదని దూరం నుంచి...
కొత్తగా నిర్మించే ఏదైనా అపార్ట్మెంటులో 50 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి. ఒక్కోదానికి 5 కిలోవాట్ల సామర్థ్యంతో కరెంటు కనెక్షన్ కావాలని దరఖాస్తు చేయగానే అవినీతికి తెరలేపుతున్నారు. అంత ఎక్కువ లోడుతో కనెక్షన్లు ఇవ్వడానికి దగ్గరలోని ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోదని, దూరంలో ఉన్న మరోచోట నుంచి సరఫరా చేయాలని చెపుతారు. దూరం నుంచి తీగలు లాగడానికి ఖర్చులు ఎక్కువగా చూపి... అవి తగ్గించాలంటే లంచాలు డిమాండు చేస్తున్నారు. కొత్త కనెక్షన్ ఇవ్వడానికి పనుల వ్యయంపై అంచనాలు వేసే విధానాలకు స్వస్తి చెపుతూ ఎల్టీ కేటగిరీలో యూనిఫామ్ లైన్ రుసుముల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కేటగిరీకి అనుగుణంగా కిలోవాట్కు రూ.1000 అదనంగా చెల్లించాలి. అప్పుడు డిస్కం సిబ్బంది వినియోగదారుడికి కనెక్షన్ ఇవ్వాలి. ఇదే విధానాన్ని హెచ్టీ కేటగిరీలోనూ ప్రవేశపెట్టేందుకు ఫిబ్రవరి మూడో వారంలో ప్రక్రియ ప్రారంభించినా ముందుకు సాగలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్