వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇన్సర్వీస్ కోటా ప్రవేశాల రద్దు
జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ(వ్యవసాయ కోర్సు)ల్లో ఇన్సర్వీస్ కోటా రద్దు కానుంది.
Agriculture University


హైదరాబాద్, 23 జూలై (హి.స.)జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ(వ్యవసాయ కోర్సు)ల్లో ఇన్సర్వీస్ కోటా రద్దు కానుంది. వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులు గతంలో నేరుగా ప్రవేశాలు పొందే విధానం ఉండగా.. దాన్ని రద్దు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఎప్సెట్(యూజీ కోసం), ఐకార్ సెట్ (పీజీ కోసం)లలో ఉత్తీర్ణులైతేనే ఈ అవకాశం కల్పిస్తామని పేర్కొంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖకు వర్సిటీ రిజిస్ట్రార్ తాజాగా లేఖ రాశారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్న డిప్లోమా ఏఈవోలు, డిగ్రీ ఏవోలకు సీనియారిటీ ప్రాతిపదికన వ్యవసాయ కళాశాలల్లో మొత్తం సీట్లలో ఐదు శాతం మేరకు బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు లభించేవి. వారి కోర్సుకయ్యే వ్యయాన్ని వ్యవసాయ శాఖ భరించేది. అయితే, గత జనవరిలో మూడో సంవత్సరం బీఎస్సీ(వ్యవసాయ) కోర్సు మొదటి సెమిస్టర్ పరీక్షల సందర్భంగా 35 మంది ఇన్సర్వీస్(ఏఈవోలు) అభ్యర్థులు లీకైన ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు రాసినట్లు వీసీ జానయ్య గుర్తించారు. వారందరి ప్రవేశాలను రద్దు చేయడంతోపాటు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇన్సర్వీస్ కోటా రద్దుకు వ్యవసాయ వర్సిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎప్సెట్, ఐకార్ సెట్ రాసిన వారికే అవకాశం ఇచ్చేలా నిబంధనలను మారుస్తామంటూ లేఖ రాయగా.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీనికి అనుగుణంగా తాజాగా రిజిస్ట్రార్ వ్యవసాయ శాఖకు లేఖ రాశారు. మరోవైపు వ్యవసాయ వర్సిటీ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని టీఎన్జీవో అనుబంధ ఏఈవోల సంఘం కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande