నేడు సీఎం చంద్రవాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం
నేడు సీఎం చంద్రవాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం
chandra babu


అమరావతి, 23 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఅధ్యక్షతన ఈరోజు (గురువారం) వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి నేరుగా సచివాలయానికి చేరుకుని ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిపాలనా అంశాలపై చర్చించనున్నారు.

ఏపీకి కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలను మంత్రిమండలి పరిశీలించనుంది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల ప్రోత్సాహం వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. రాష్ట్రంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను విస్తరించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కూడా కేబినెట్లో సమీక్ష జరగనుంది. విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రజా భాగస్వామ్యం వంటి అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రులకు సూచించనుంది. విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అదేవిధంగా కొందరు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజాసేవల మెరుగుదలపై సమీక్షించనున్నారు.

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాలు, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు సమర్థవంతంగా స్పందించే విధానంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా వినియోగంపై ప్రత్యేక సూచనలు ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్లో నేడు ‘మీభూమి - బ్లాక్చెయిన్’ వ్యవస్థను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. భూ రికార్డుల భద్రత, పారదర్శకత లక్ష్యంగా కొత్త వ్యవస్థను సీఎం అమలు చేయనున్నారు. ఏడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ‘మీభూమి - బ్లాక్చెయిన్’ సేవలు ప్రారంభించనున్నారు. భూ రికార్డుల్లో టాంపరింగ్కు అవకాశం లేకుండా టాంపర్ - ప్రూఫ్ సాంకేతికత వినియోగాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. భూ మోసాలను అరికట్టడం కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. భూ సేవలను మరింత పారదర్శకంగా, విశ్వాసనీయంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు తెలిపారు.

విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు, పరిపాలనా నిర్ణయాలు, ప్రభుత్వ ప్రచార వ్యూహాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

‘మీభూమి - బ్లాక్చెయిన్’ వ్యవస్థను ప్రారంభించనున్నా సీఎం చంద్రబాబు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande