
హైదరాబాద్, 23 జూలై (హి.స.)రాష్ట్రంలోని వందల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతున్నారు. కొన్ని బడుల్లో శౌచాలయాల కొరత... మరికొన్నిచోట్ల నిర్వహణలేక అత్యవసర సమయాల్లో అవస్థలు పడుతున్నారు. బాలురు బహిరంగ ప్రదేశాలను ఆశ్రయిస్తూ ఎలాగోలా సర్దుకుపోతున్నా..బాలికల అవస్థలు అన్నీఇన్నీ కావు. యూడైస్ గణాంకాల ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తమ అవసరాలు తీర్చుకునేందుకు వీల్లేని పరిస్థితిలో 10-15 శాతం పాఠశాలలుండటం పరిస్థితికి నిదర్శనం. ఉన్నచోట శుభ్రత పాటించకపోవడం, వాటి దగ్గరకు వెళ్లేందుకు సరైన దారిలేకపోవడం, కొన్నిచోట్ల తలుపులే లేకపోవడం వంటి సమస్యలున్నా..పట్టించుకునే వారు కరవయ్యారనే ఆరోపణలున్నాయి. అనేకచోట్ల బిల్లులురాని కారణంగా నిర్మాణాలు పూర్తికాకపోవడమూ సమస్యను పెంచుతోంది.
నిబంధనలేం చెబుతున్నాయి..
నిబంధనల ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి, ప్రతి 20 మందికి ఒక మూత్రశాల ఉండాలి. అవి కూడా బాలురు, బాలికలకు వేర్వేరుగా నిర్మించాలి. అంటే 40 మంది విద్యార్థులున్నచోట బాలురుకు ఒక మరుగుదొడ్డి, రెండు మూత్రశాలలు, బాలికలకు అంతే సంఖ్యలో నిర్మించాల్సి ఉంటుంది.
కొన్నేళ్ల క్రితమే అలా నిర్మించడం వీలుకాదనే అభిప్రాయానికొచ్చిన విద్యాశాఖ 80 మందికి ఒక మరుగుదొడ్డి, 40 మందికి ఒక మూత్రశాల సరిపోతుందని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 వేల పాఠశాలలుండగా...వాటిల్లో సుమారు 12 వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30 లోపే ఉంది. 200 కన్నా ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలు ఐదు వేలకు మించి లేవు. విద్యార్థులు ఏటికేడు తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో మరుగుదొడ్ల నిర్మాణంపై విద్యాశాఖ శ్రద్ధపెట్టడం లేదనే వాదనా ఉంది. ఉదాహరణకు 2025 డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,823 బాలికల శౌచాలయాల నిర్మాణానికి అనుమతులు మంజూరుచేయగా... వాటిల్లో 851 పూర్తయ్యాయి. 342 పురోగతిలో ఉన్నాయి. ఇంకా 630 శౌచాలయాల నిర్మాణ పనులు ప్రారంభమే కాకపోవడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ... అవసరమైన చోట కొత్తవి నిర్మించడంతోపాటు అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను ఈ విద్యాసంవత్సరంలోనే పూర్తిచేస్తామని, నిధులు ఇచ్చేందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపిందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత (గ్రౌండ్)పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 865కు చేరింది. బాలికలకు మాత్రమే మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నాయి. బాలురకు లేకపోవడంతో అవసరాలకోసం బయటకు పరుగులు తీయాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించినా..నీటి వసతి, సెఫ్టిక్ట్యాంకు ఏర్పాటు చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్