ఎరువు.. బరువు... ఒక్కసారిగా ధరలకు రెక్కలు
వికారాబాద్ జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పటి వరకు సగం మాత్రమే సాగు చేశారు.
Farmers


హైదరాబాద్, 23 జూలై (హి.స.)వికారాబాద్ జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పటి వరకు సగం మాత్రమే సాగు చేశారు. వర్షాలు కురిస్తే మిగతా పంటలు సాగు చేయాలని రైతులు ఎదురుచూస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, ఎరువుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల దిగుమతి ఖర్చులు పెరగడం, సరఫరా నిలిపిపోయిందని సాకులు చెప్పి మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో పలుచోట్ల డీఏపీ, యూరియా నిల్వలు లేక రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.

డీఏపీ ఒక్కో బస్తాకు రూ.1,350 ఎమార్పీ ఉంటే రూ. 1,700 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. యూరియా బస్తా రూ.266కు అమ్మాల్సి ఉండగా రూ.400కు విక్రయిస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు రకాలను బట్టి రూ. 1,200 నుంచి రూ.2,000ల వరకు ధర ఉంది. రెండు రోజుల క్రితమే ప్రభుత్వ ధరలను పెంచింది. ఒక్కో బస్తాను రూ.125ల నుంచి రూ.650ల వరకు పెంచింది. కాంప్లెక్స్ ఎరువులు పెంచకముందు బస్తాకు రూ.400 నుంచి రూ.600 వరకు విక్రయిస్తున్నారు. అయితే ధరలు పెంచిన తర్వాత 20:20:0:13 రూ.3వేలకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 5.9లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తారని అంచనా. అందుకు అన్ని రకాల ఎరువులు 1,13,851 టన్నుల ఎరువుల అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇప్పటి వరకు మార్కెట్లో 40 శాతం ఎరువులు నిల్వలు కూడా లేవని కొందరు వ్యాపారులు చెబుతున్నారు.

రైతులకు ఎరువులు కావాలంటే ముందు యాప్లో నమోదు చేసుకోవాలి. అలా అయితేనే ఎరువులు దొరుకుతున్న పరిస్థితి. ఇందులోనూ రాజకీయ నేతల ప్రభావం ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు పలుకుబడి ఉన్న నేతలు చెప్పిన విధంగా నడుచుకోవడంతో అసలు రైతులు అవస్థలు పడుతున్నారు. రాజకీయ నాయకులు చెప్పిన సమయానికి యాప్లో నిల్వలు ఉంచి వారు బుకింగ్ చేసుకున్న తర్వాత మూసేస్తున్నారు. అప్పటికే ఆయా దుకాణాలకు కేటాయించిన ఎరువులు ఖాళీ అయిపోతున్నాయి. రైతులు బుక్ చేసుకుందానే లోపే నిమిషాల వ్యవధిలో ఖాళీ కావడంతో ఎరువుల కోసం నానా అవస్థలు పడుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande