
తిరుమల, 23 జూలై (హి.స.)
పీశ్రీవాణి దర్శన టికెట్ల భక్తుల కోసం తిరుమలలో లాంజ్ నిర్మించాలని తితిదే భావిస్తోంది. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టికెట్లు మూడు నెలల ముందు 500 ఆన్లైన్లో, ప్రతిరోజూ 500 కరెంట్ బుకింగ్లో, మరో 300 గతంలో విరాళాలిచ్చి టికెట్లు పొందని వారి కోసం కేటాయిస్తున్నారు. మరో 200 టికెట్లు రోజూ తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆఫ్లైన్లో ఇస్తున్నారు. రూ.10,000 విరాళం, రూ.500 టికెట్ కొనుగోలు చేస్తే తితిదే వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తోంది. ప్రస్తుతం మూడు నెలలకు ముందు ఈ టికెట్లు పొందిన భక్తులకు గదులు కేటాయిస్తున్నారు. కరెంట్ బుకింగ్లో టికెట్లు పొందిన వారికి అదేరోజు సాయంత్రం 4 గంటలకు తితిదే దర్శనం కల్పిస్తోంది. ఉదయం 9 గంటలకు దర్శన టికెట్ పొందిన భక్తుడు సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వస్తోంది. వారికి గదులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీవాణి భక్తులు తిరుమలలో వేచి ఉండేందుకు ఎయిర్పోర్టుల్లో ఉన్నట్లు లాంజ్ నిర్మించాలని తితిదే ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవనానికి సమీపంలోని న్యూ ఉడ్సైడ్ హోటల్ ప్రాంగణాన్ని లాంజ్లా తీర్చిదిద్దనున్నారు. గతంలో హోటల్గా ఉన్న ఈ భవనం ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఇందులో భక్తుల కోసం విశ్రాంతి గదులు, ఫర్నిచర్, స్నానాల గదులు, ఇంటర్నెట్ సౌకర్యం, ఫుడ్కోర్ట్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ