ఖాతా నిలిపేస్తున్నారు.. కారణమడిగితే చేతులు చాస్తున్నారు
మ్యూల్ ఖాతాల పేరుతో వేరే రాష్ట్రాల పోలీసుల వసూళ్లు బయటపడలేక బాధితుల గగ్గోలు.
Cyber crime


హైదరాబాద్, 23 జూలై (హి.స.)ఎక్కడో ఉండి ఇంకెక్కడో దోచుకోవడం సైబర్ నేరగాళ్ల నైజం. కొంతమంది ఇతర రాష్ట్రాల పోలీసులూ అదే బాట పడుతున్నారు. దోపిడీ సొమ్ము మీ ఖాతాలో జమ అయిందంటూ అడ్డగోలుగా ఖాతాలు స్తంభింపజేస్తున్నారు. వాటిని తిరిగి వాడుకలోకి తేవడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క ఖాతా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న బాధితులు తమ తప్పేమీ లేకపోయినా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుండటంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ బాధలకు తోడు అష్టకష్టాలు పడి ఖాతా స్తంభింపజేసిన పోలీసులను సంప్రదిస్తే చేతులు తడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రకరకాల ఎత్తులతో అడ్డగోలుగా దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు పోలీసులకు పట్టుబడకుండా దోపిడీ సొమ్మును మ్యూల్ ఖాతాల్లోకి మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. నేరగాళ్లకు ఇలాంటి అద్దె ఖాతాలు సమకూర్చే ముఠాలు అనేకం ఉన్నాయి. వీటికి కళ్లెం వేసే ఉద్దేశంతో దోచుకున్న డబ్బు జమ చేసిన ఖాతాలను పోలీసులు స్తంభింపజేస్తున్నారు. ఎక్కడ కేసు నమోదయిందో అక్కడి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత బ్యాంకు ఖాతాలు నిలిపివేస్తున్నారు. 2024 సెప్టెంబరు 10 నుంచి 2025 డిసెంబరు 31 వరకూ దేశవ్యాప్తంగా ఇలా 26.48 లక్షల ఖాతాలు స్తంభింపజేశారు.

వాస్తవానికి దోచుకున్న డబ్బుకు సంబంధించిన లావాదేవీ మాత్రమే నిలిపివేయాలి. అంటే ఒక బాధితుడి నుంచి రూ.లక్ష కొట్టేసి దాన్ని రెండు ఖాతాల్లోకి చెరో రూ.50 వేలు.. అక్కడి నుంచి మరో రెండు ఖాతాల్లోకి చెరో రూ.25వేలు తరలిస్తే.. తొలి రెండు ఖాతాలు, వాటి నుంచి బదిలీ అయిన డబ్బును స్తంభింపజేయాలి. పోలీసులు మాత్రం ఇలాంటి ఖాతాల నుంచి లావాదేవీలు జరుగుతున్న అన్ని ఖాతాలను స్తంభింపజేస్తున్నారు. మన రాష్ట్రంలో ఖాతాల స్తంభనలో పోలీసులు వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటున్నా.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం గొలుసుకట్టు మాదిరిగా వందల ఖాతాలు స్తంభింపజేయాలంటూ ఆయా బ్యాంకులకు లేఖలు రాస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande