తెలంగాణ ప్రజలకు గుడ్న్న్యూస్.. పూర్తయిన కాజీపేట - బలార్షా మూడో రైల్వే లైన్
తెలంగాణ ప్రజలకు గుడ్న్న్యూస్.. పూర్తయిన కాజీపేట - బలార్షా మూడో రైల్వే లైన్
Railway line


కాజీపేట, 23 జూలై (హి.స.)

తెలంగాణ నుంచి ఢిల్లీ సహా నార్త్ స్టేట్స్ కు రైళ్ల రాకపోకలు సాగించే గ్రాండ్ ట్రంక్ రూట్లో రైలు రాకపోకలను మరింత సులభతరం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది. కాజీపేట బలార్షా మధ్య చేపట్టిన 203 కిలోమీటర్ల మూడో రైల్వే లైన్ నిర్మాణంతో పాటు విద్యుదీకరణ పనులను విజయవతంగా పూర్తి చేసింది. ఆసిఫాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ మధ్య ఉన్న 11 కిలోమీటర్ల చివరి విడత పనులను, బీబ్రా నదిపై నిర్మించిన కీలక వంతెనను జులై 22న విజయవంతంగా పూర్తి చేయడంతో ఈ ప్రాజెక్టు మొత్తం అందుబాటులోకి వచ్చినట్లయింది.

తీరనున్న రద్దీ కష్టాలు:

రూ.3,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ పరిధిలో 159 కిలోమీటర్లు, మహారాష్ట్ర పరిధిలో 44 కిలోమీటర్ల మేర మూడో లైన్ పనులను పూర్తి చేశారు. ఈ సెక్షన్లో బొగ్గు, సిమెంట్ పరిశ్రమల రవాణా ఎక్కువగా ఉండటంతో పాటు ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉండేది. కొత్త లైన్ నిర్మాణంతో రైళ్ల వేగం పెరగడంతో పాటు సరుకు రవాణా వేగవంతం కానుంది. విద్యుదీకరణ వల్ల ఇంధన ఆదా జరిగి పర్యావరణానికి లబ్ధి చేకూరుతుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande